బ్యాట్‌తో పాక్‌ బౌలర్‌ను కొట్టబోయిన పొలార్డ్.. పాత గొడవను గుర్తు చేసిన ఘటన.. ఇదిగో వీడియో!

  • మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్, న్యూయార్క్ మ్యాచ్‌లో ఉద్రిక్తత
  • బౌలర్ ఆసిఫ్ మహమూద్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కీరన్ పొలార్డ్
  • రనౌట్ ప్రయత్నం చేయబోగా బ్యాట్‌తో హెచ్చరించిన వైనం
  • ఈ మ్యాచ్‌లో పొలార్డ్ సెంచరీ చేసినా ఓటమిపాలైన ఎంఐ న్యూయార్క్
  • గతంలో ఐపీఎల్‌లో స్టార్క్‌తో గొడవను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2026 సీజన్‌లో మైదానంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎంఐ న్యూయార్క్ కెప్టెన్, విధ్వంసకర బ్యాటర్ కీరన్ పొలార్డ్ తన సహనాన్ని కోల్పోయి, ప్రత్యర్థి బౌలర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా బ్యాట్‌తో కొట్టేందుకు దూసుకెళ్లినంత పనిచేశాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఉద్రిక్తత నెలకొంది. పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికా బౌలర్ ఆసిఫ్ మహమూద్ వేసిన ఓవర్ చివరి బంతిని పొలార్డ్ ఆడాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. ఫాలో త్రూలో పొలార్డ్ క్రీజు నుంచి కొద్దిగా ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన మహమూద్, పొలార్డ్‌ను రనౌట్ చేసే ఉద్దేశంతో వికెట్ల వైపు బంతిని విసిరేందుకు సిద్ధమయ్యాడు.

సాధారణంగా ఇలాంటి సమయంలో బ్యాటర్ వెంటనే క్రీజులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, పొలార్డ్ అందుకు భిన్నంగా స్పందించాడు. బౌలర్ తనపైకి బంతిని విసురుతున్నాడని భావించి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. క్రీజులోకి వెళ్లడం మానేసి, చేతిలోని బ్యాట్‌ను పైకెత్తి మహమూద్ వైపు దూసుకెళ్లాడు. బంతి విసిరితే బ్యాట్‌తో కొడతానన్నట్టుగా హెచ్చరించాడు. పొలార్డ్ దూకుడు చూసి ఆశ్చర్యపోయిన బౌలర్ మహమూద్ వెంటనే వెనక్కి తగ్గాడు. దీంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆసక్తికరంగా ఈ ఘటన జరిగినప్పటికీ పొలార్డ్ తన ఏకాగ్రతను కోల్పోలేదు. కేవలం 56 బంతుల్లోనే అజేయ శతకంతో చెలరేగాడు. అయినప్పటికీ, తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సంఘటన తర్వాత నెటిజన్లు పొలార్డ్ పాత గొడవలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పొలార్డ్‌కు జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు కూడా స్టార్క్ బౌలింగ్ చేస్తుండగా క్రీజు నుంచి పక్కకు జరిగిన పొలార్డ్, ఆ తర్వాత స్టార్క్ తన వైపు బంతి విసరడంతో బ్యాట్‌ను విసిరేందుకు ప్రయత్నించాడు. ఆ ఘటన అప్పట్లో పెను దుమారం రేపింది.

ఇప్పుడు మేజర్ లీగ్‌లోనూ అదే తరహా ప్రవర్తనను పునరావృతం చేయడంతో 'పొలార్డ్ అస్సలు మారలేదు', 'అతడి దూకుడు ఎప్పటికీ తగ్గదు' అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మైదానంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడంపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు మాత్రం అతడి దూకుడైన శైలిని సమర్థిస్తున్నారు.

Kieron Pollard
Major League Cricket
MI New York
Asif Mahmood
Cricket Fight Video
MLC 2026

More Telugu News